కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram)ఈడీ (ED) విచారణకు హాజరయ్యారు. చైనా పౌరులకు అక్రమ వీసాల కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ని ఈడీ ప్రశ్నించింది. చైనీస్ వీసా కేసు నిద్రాణ స్థితిలో ఉందన్నారు. అది పూర్తిగా చనిపోయిందని, కేసును మూసి వేశారని అన్నారు. దర్యాప్తు సంస్థ ముందు తాను హాజరు కావడం రొటీన్ వ్యవహారం అన్నారు.
తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావడం ఇది 20వసారి అని పేర్కొన్నారు. బహుశా వాళ్లు నన్ను మిస్ అవుతున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే వాళ్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్తున్నానని తెలిపారు. ఈ కేసులో వ్యూహం ఏంటి ? అని ప్రశ్నించారు. తనపై మొత్తం మూడు కేటగిరీల కేసులు ఉన్నాయని వివరించారు.
అందులో మొదటి వర్గాన్ని బోగస్ అంటారని చెప్పారు. రెండో కేటగిరీని మోర్ బోగస్ అని, మూడో కేటగిరీని మోస్ట్ బోగస్ అని అంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ కేసు వెనుక ఎవరున్నారో తనకు తెలియడం లేదన్నారు. బహుశా అదేదో చైనా దెయ్యం అయి ఉండాలన్నారు. తన లాయర్లు ఇప్పటికే విస్తృతమైన సమాచారాన్ని ఇచ్చారని స్పష్టం చేశారు.
వారికి సుమారు 100 పేజీల సమాధానం ఇచ్చారన్నారు. తాను కూడా దాన్నే పునరావృతం చేస్తానన్నారు. ఇది క్రిస్మస్ సీజన్ అన్నారు. వారు తనను మిస్ అవుతున్నట్టు కనిపిస్తోందన్నారు. అందుకే వాళ్లు మరోసారి తనను పిలిచారన్నారు. అందుకే వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేందుకు తాను ఇక్కడకు వచ్చానన్నారు. గతేడాది మేలో కార్తీ చిదంబరంపై మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదుచేసింది.