నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ (NCP Chief) ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్‌లు చర్చల ద్వారా కశ్మీర్ వివాదానికి ఒక ముగింపు పలకాలన్నారు. లేకపోతే కశ్మీర్ కూడా గాజా. పాలస్తీనాల పరిస్థితిని ఎదుర్కొంటుందని తెలిపారు. భారత్ తన పొరుగు దేశాలతో స్నేహంగా ఉంటే ఇరు దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఫరూక్ అబ్ధుల్లా గుర్తు చేశారు. మనం కావాలంటే మన స్నేహితులను మార్చుకోగలమని కానీ మన పొరుగు వాళ్లను మార్చుకోలేమని వాజ్ పేయి అన్నారని చెప్పారు. ప్రతిదానికి యుద్దం ఒకటే మార్గం కాదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ అన్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు చర్చలు ఎక్కడ అని ప్రశ్నించారు. నవాజ్ షరీప్ ప్రధాని కాబోతున్నారని చెప్పారు. భారత్ తో చర్చలకు తాము సిద్ధమని షరీఫ్ ప్రకటించారని వెల్లడించారు. కానీ పాక్ తో మనం చర్చలకు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చర్చల ద్వారా కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం సందర్శించారు. ఉగ్రవాదులు తమ రహస్య ప్రదేశాలుగా గుహలను ఉపయోగించుకుంటారని, వాటిని కూల్చి వేయాలని సైనికులను ఆయన ఆదేశించారు. అనంతరం ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.