తెలంగాణ (Telangana) హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ (BRS)పార్టీ ఒక్కటేనని మాజీ సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని చెప్పారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీశ్‌రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ….. సంస్థాగతంగా బీఆర్ఎస్ చాలా బలంగా ఉందని తెలిపారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరాశ చెందాల్సిన పని లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ అని ప్రజలకు తెలుసన్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని చెప్పారు. ఆ పోటీలో బీఆర్ఎస్ పై చేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సమయంలో అడ్డుకుని కాపాడాల్సిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ నేతలను ఆయన కోరారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు నష్టం కలుగుతుందన్నారు. ఆపరేషన్ మ్యానువల్, ప్రొటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మళ్ళీ కలుద్దాం.. లోక్ సభ ఎన్నికల వ్యూహం పై చర్చిద్దామని పార్టీ నేతలకు తెలిపారు.