-వెంటాడుతాం… వేటాడుతాం
-బదనాం చేస్తే పెద్దోళ్లవుతారా
-కరెంట్ కు రోగం వచ్చిందా
-అధికారం శాశ్వతం కాదు
-దద్దమ్మల రాజ్యం గిట్లనే ఉంటది
-నదుల మీద రేవంత్ కు అవగాహన లేదు
-నన్నడిగితే చెప్పేవాడిని
-అడిగే సంస్కారం ఉండొద్దా
-కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారిగా బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) బహిరంగ సభలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పై మరోసారి నిప్పులు చెరిగారు. తెలివిలేక.. ప్రభుత్వాన్ని నడిపే చేతగాక మందిమీద బద్నాంపెట్టి బతుకుదామనుకుంటున్నారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అట్లగాదు బిడ్డా జాగ్రత్తా..! బతుకనివ్వం.. వెంటపడుతం.. వేటాడుతాం అంటూ కాంగ్రెస్‌కు తీవ్రహెచ్చరికలు చేశారు.
ఛలో నల్లగొండ సభలో కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..కేసీఆర్‌ను తిడితే మీరు పెద్దొళ్లు అవుతరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మీద బదనాం పెడితే పెద్దోళ్లు అవుతరా? ప్రజల హక్కులు గాలికొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నరో.. దుర్భాషలాడుతున్నరో.. దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నరో టీవీల సాక్షిగా చూస్తున్నరని చెప్పారు.
రాష్ట్రం వచ్చాక కరెంటు తెచ్చామన్నారు. ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగు చేసి ఏడాదిన్నర నుంచి 24గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చామని చెప్పారు. మీరంతా సంతోషంగా నడింట్లో పండుకొని పంటలు పండించారని గుర్తు చేశారు. పాములు, తేళ్లు కరువంగా బాయిలకాడికి పోలే. కేసీఆర్ గవర్నమెంట్ పోంగనే కట్కేసినట్టే బంద్ అవుతుందా కరెంట్? నేను తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటు దానికి ఏం రోగం వచ్చిందన్నారు.. మాయ రోగం వచ్చిందా? యాడపోయే కరెంటు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతమని చెప్పారు. మన వాటా శాశ్వతమని…. మన బతుకులు నిజమని… మన పిల్లల భవిష్యత్ నిజం. దాని కోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడి రాష్ట్రం తెచ్చినం కాబట్టి.. బీఆర్‌ఎస్ సైనికులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.. మన పోరాటం కొనసాగుతూ ఉండాలని సూచించారు.
దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది…. చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది….. వాళ్లు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావొద్దని సూచనలు చేశారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ను నిలదీయాలన్నారు. ఏమైందిరా బిడ్డ నా కరెంటు అని అడగాలన్నారు. మొన్నటిదాకా నడిచిన కరెంట్ కాకుండా.. ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో 4వేల మెగాపవర్ ప్లాంట్ కట్టినం జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో. 90శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. రెండుమూడు నెలలు తిప్పలుపడితే 4వేల మెగావాట్ల పవర్ వస్తుందన్నారు.
అటు కేంద్రాన్ని కానీ.. అధికారులను గానీ.. కృష్ణా ట్రిబ్యునల్ గానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రప్ప పని చేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు గానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలన్నారు. ఈ మాట చెప్పేందుకే తాను ఇంత దూరం వచ్చానని చెప్పుకొచ్చారు. మిమ్మల్ని సమీకరించిన. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందన్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి. పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేయాలన్నారు. కానీ ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? పొద్దున లేస్తే సొల్లుపురాణం.. కేసీఆర్‌ను తిట్టాలే అన్నారు.
ప్రజలను కరెంట్‌కు తిప్పలు పెట్టినా.. నీళ్లకు తిప్పలుపెట్టినా.. మంచినీళ్లకు తిప్పలుపెట్టినా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీస్తామన్నారు. ‘మీకు గవర్నమెంట్ ఇచ్చారు. మాకు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చారు. మిమ్మల్ని నిలదీసే బాధ్యత ఇచ్చారు తప్పా.. ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తం తప్పా.. వదిలిపెడతాం అనేదాంట్లో ఉండొద్దు’అని హెచ్చరించారు. ఏ విధంగా బీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో.. ఆ విధంగా కరెంటును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో ఒకరు ఓడొచ్చు.. ఒకరు గెలవొచ్చని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. మళ్లీ తాము డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. అప్పుడు మేం గిట్లనే మాట్లాడాలా..? ఈ పద్ధతిని అనుసరించాలా..? అని ప్రశ్నించారు. నదుల నీళ్ల మీద నీకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. తనను అడిగితే తాను చెప్పేవాడినన్నారు. అడిగే సంస్కారం, తెలివి ఉండొద్దా..? నిప్పులు చెరిగారు. కేఆర్ఎంబీకి అప్పజెప్పమంటున్నారు.. మమ్మల్ని ఎవరిని అడిగినా చెప్పేటోళ్లం కదా.. అప్పజెప్పడం, ఆగమావడం.. బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు ఇదేనా మీ తెలివి అని నిలదీశారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే తన చివరి వరకు, తన కట్టె కాలే వరకు పులిలాగా లేచి కొట్టాడుతానన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడితే మీరూ విన్నారని… ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండేనట ఆయనకు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగుండే.. ఇప్పుడు మంచిగలేదట. శ్రీకాంత చారి ఎందుకు చనిపోయిండు. ఇదే జిల్లాలో ఉన్న బిడ్డ. ఉద్యమకారులు ఎందుకు చనిపోయారు ? అంతపెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది ? లక్షలు, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నరు ? ఇంత సోయితప్పి మంత్రులు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.