తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం ఒక్క బీఆర్ఎస్ ( BRS)కు మాత్రమే తెలుసని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. భారత దేశంలో రైతు బంధు పుట్టింది కేసీఆర్, బీఆర్ఎస్ నుంచేనన్నారు. ఎన్నికల సమయంలో రాయి ఏదో రత్నమేదో గుర్తించాలని ప్రజలకు సూచించారు. ప్రజలు పరిణితితో ఆలోచించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు.
షాద్ నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మీ ముందే బీఆర్ఎస్ పుట్టిందని అన్నారు. బీఆర్ఎస్ ఏం చేసిందో మీరంతా చూశారని తెలిపారు. అభ్యర్థులను కాదు వాళ్ల వెనక ఉన్నా పార్టీలేంటో చూడాాలన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అంటూ విరుచుక పడ్డారు.
మళ్లీ అధికారంలోకి వచ్చాక షాద్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. రైతుబంధు, 24గంటల కరెంట్ వేస్ట్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. మరి వాళ్లు చేసే విమర్శలు కరెక్టేనా అని ప్రజలను ప్రశ్నించారు. రైతు బంధు తీసుకున్న వాళ్లలో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
రైతు బంధును కాంగ్రెస్ వాళ్లే ఆపేశారని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే వినిపించేవన్నారు. కాంగ్రెస్ వాళ్లు 1940 దగ్గరే ఆగిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలు నమ్మితే నష్టపోయేది ప్రజలేనన్నారు. పార్టీల చరిత్రను తెలుసుకొని ఓటేయాలన్నారు. ఆలోచించి ఓటేయకపోతే ఐదేండ్లు నష్టపోతరన్నారు.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచిదో అంతా చర్చించి ఓటేయాలని కోరారు. 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధును రూ. 16 వేలకు పెంచుతామన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. 24గంటల కరెంట్ కావాలా లేక 3 గంటల కరెంట్ కావాలా ప్రజలే తేల్చుకోవలన్నారు.