కేయూలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఆరో రోజు దీక్ష చేసిన విద్యార్థి జేఏసీ (JAC) నేతలను పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈక్రమంలోనే బీజేపీ (BJP) రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender), మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, టీపీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి విద్యార్థులను కలిసి మాట్లాడారు.
పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు ఈటల రాజేందర్. ఆందోళనకు దిగిన ఏబీవీపీ (ABVP) విద్యార్థులపై కేసులు నమోదు చేసి పోలీసులు కొట్టడంపై మండిపడ్డారు. విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగు పెట్టాలంటే వైస్ ఛాన్సలర్ పర్మిషన్ అవసరమని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన వీసీ పోలీసులతో దాడి చేయించడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. వైస్ ఛాన్సలర్ వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఉద్యమంతో సీఎం సీట్లో కూర్చున్న కేసీఆర్ ఉద్యమ చైతన్యాన్ని నీరు గారుస్తున్నారని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండేది డిసెంబర్ వరకేనని తెలిపారు. విద్యార్థి లోకాన్ని అవమానపరిస్తే ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాల పురిటిగడ్డ కేయూ విశ్వవిద్యాలయ విద్యార్థులను రెచ్చగొట్టే చర్యలు చేపట్టి దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి లోకం కేసీఆర్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైందన్నారు ఈటల రాజేందర్. వీసి వైఖరి, పోలీసుల దాడికి నిరసనగా మంగళవారం చేపడుతున్న జిల్లా బంద్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.