రాష్ట్రంలో పలు సంచనాలకు తెరతీసిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అన్నీ తానై వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ( SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabakar Rao) మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ నోటీసులకు ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గురువారం రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు ఫ్యామిలీ ట్రిప్ పేరుతో విదేశాలకు పారిపోయాడని తెలిసింది. ప్రస్తుతం ఆయన అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల వీసాపై ఆయన అక్కడకు వెళ్లినట్లు సమాచారం ఉంది.
కాగా, తనకు క్యాన్సర్ వ్యాధి ఉందని దాని చికిత్స కోసం అమెరికా వచ్చినట్లు ప్రభాకర్ రావు ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం అధికారులకు సమాచారం అందిచంనట్లు కూడా తెలిసింది. జూన్ లేదా జూలైలో హైదరాబాద్‌కు తిరిగి వస్తానని గత నెల ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు తెలిసిందే.
ఇదిలాఉండగా, ఈ కేసులో ఇప్పటికే నలుగురు అధికారులను ప్రత్యేక విచారణ బృందం అధికారులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. కాగా, మొన్నటివరకు రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసిన ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రస్తుతం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.ఈ కేసులో సాక్ష్యాధారాలు ధ్వంసం అయినందున లీగల్‌గా ముందుకు వెళ్లలేమని కేసును విచారిస్తున్న ఓ ఉన్నతాధికారి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.