ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు(Ap students) తెలంగాణ విద్యాశాఖ (Telangana Education Board) కీలక సూచన చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అక్కడి విద్యార్థులు తెలంగాణలోని విద్యాసంస్థల్లో స్థానిక కోటాను పొందేవారు.ప్రస్తుతం రాష్ట్రాలు విడిపోయిన కారణంగా స్థానికత కోటాను కేవలం తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేసిన విషయం తెలిసిందే.
అయితే, నేటికి తెలంగాణలోని కొన్ని విద్యాసంస్థలు ఏపీ విద్యార్థుల ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ ఏపీ స్టూడెంట్స్‌కు శుభవార్త అందించింది. ఏపీ విభజన చట్టం ప్రకారం.. ఏపీలోని విద్యార్థులకు తెలంగాణలోని విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వీలుగా ప్రవేశాలను కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, విద్యార్థుల ఉమ్మడి ప్రవేశాల అమలు గడువు జూన్ 2తో ముగియనుందని తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. అదేవిధంగా గడువు తేదీలోగా తెలంగాణలో జరిగే ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఉత్తర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టంచేసింది.
జూన్ 2 తర్వాత పరీక్షలు రాసే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రిజర్వేషన్స్ ఉండవని తెలిపింది. అయితే, జూన్ 2వ తేదీ తర్వాత తెలంగాణ విద్యార్థులకు మాత్రమే స్థానికత వర్తిస్తుందని, వారికే ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టంచేసింది. ఏదైనా సందేహాలుంటే తెలంగాణ విద్యాశాఖకు చెందిన సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలని ఆంధ్రా విద్యార్థులకు సూచించింది.