దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బూత్‌ల వారీగా ఆఫీసర్స్‌ను పంపించే కార్యక్రమం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ‘మేరా బూత్, సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా కాచిగూడ భూమన్న గల్లీలోని పలు అపార్ట్మెంట్లో పోలింగ్ బూత్‌లో ఓటర్ వెరిఫికేషన్, ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం కిషన్ రెడ్డి మట్లాడుతూ.. అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.ఓటరు లిస్టులో(Voters List) నమోదు సంబంధిత దరఖాస్తు ఫారాలు, అడ్రస్ మార్పు, యువ ఓటర్ల నమోదు తదితర సేవలను వినియోగించుకోవచ్చని కిషన్ రెడ్డి చెప్పారు.
ఓటర్ లిస్టులో తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు 18 ఏళ్లు పైబడిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. బర్కత్‌పుర పోలింగ్ బూత్‌లోని కొన్ని బస్తీలు, కాలనీ ప్రజల్లో తాను కూడా ఈ రోజు అవేర్నెస్ తీసుకొచ్చేందుకు వచ్చినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు తమ ఓటర్ ఐడీలో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.