గణేష్ ఉత్సవాలంటేనే గుర్తుకు వచ్చే ఖైరతాబాద్ (Kairathabad) గణనాధుడు (Ganapati) ఈ ఏడాది ప్రపంచ రికార్డు (World Record) సృష్టించాడు. ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమించిన ఖైరతాబాద్ గణేషుడు మట్టితో తయారైన పెద్దదైన వినాయకుడిగా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టితో ఈ విగ్రహన్ని తయారు చేశారు.
మరికొన్ని విశేషాలు…
ఈసారి ఖైరతాబాద్ గణేషుడు 63 ఎత్తులో…22 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్నాడు. గతేడాది 58 అడుగుల ఎత్తులో గణనాథుడు దర్శనమిచ్చాడు. ఈసారి పర్యవరణాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మట్టితో విఘ్నేశ్వరుడిని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని మూడు నెలల పాటు తయారు చేశారు. ఈ సారి కూడా గతేడాది మాదిరిగానే 900 కేజీలకు పైగా గణానాథుడి లడ్డూ ప్రసాదం తయారు చేశారు.
గతేడాది మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా మట్టితో విగ్రహం తయారు చేశారు. సుమారు 150 మంది వ్యక్తులు మూడు షిఫ్టులలో పనిచేసి విగ్రహాన్ని నిర్మాణాన్ని పూర్తిచేశారు. విగ్రహాల తయారీలో 30 ఏళ్ల పాటు అనుభవజ్ఞులైన సుప్రసిద్ధ విగ్రహ కళాకారులు చెన్నైకి చెందిన రాజేంద్రన్, ఒడిశాకు చెందిన మట్టి కళాకారుడు జోగారావు దీనిని రూపొందించారు. కాకినాడ సత్య ఆర్ట్స్‌కు చెందిన కలర్ ఆర్టిస్టులు రంగులతో తీర్చిదిద్దారు.
విగ్రహం బరువు 45-50 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఫ్రేమ్ కోసం ఇప్పటివరకు 22 టన్నుల ఉక్కును ఉపయోగించగా, రాజస్థాన్ నుంచి 40,000 కిలోల మట్టిని తీసుకువచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నుంచి 40 కిలోల జ్యూట్ పౌడర్ 1000 బస్తాలు, యాదాద్రి నుంచి వరి పొట్టు సేకరించినట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.