భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు ఎంతోమంది పోరాటాలు చేశారు. ఈ ప్రయత్నంలో తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదిలి వేశారు. అలాంటి వారిలో ఖుదీరాం బోస్ (Kudriam Bose) ఒకరు. నూనూగు మీసాల వయస్సులో వలస పాలకులపై ఉక్కు పిడికిలి బిగించి ఉరికొయ్యలను ముద్దాడాడు. ఎంతోమందికి ఆదర్శప్రాయంగా (Inspiration) నిలిచారు.
1889 డిసెంబర్ 3న పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ లో జన్మించారు. తండ్రి తైలోక్యనాథ్ బసు, తల్లి లక్ష్మీ ప్రియాదేవి. ఖుదిరాం బోస్ ఆరవ ఏట తల్లిదండ్రులు మరణించారు. దీంతో సంరక్షణ బాధ్యతను ఆమె సోదరి రూపాదేవి స్వీకరించింది. మిడ్నాపూర్ జిల్లాలో అరబిందో, సిస్టర్ నివేదితల ప్రసంగాలకు ఆకర్షితుడై విప్లవ భావాలను పెంచుకున్నారు ఖుదీరాం బోస్. దేశం నుంచి బ్రిటీష్ వాళ్లను వెళ్లగొట్టేందుకు విప్లవ పంథానే సరైన మార్గమని అనుకున్నారు.
15 ఏండ్ల వయసులోనే ‘అను శీలన్ సమితి’ అనే విప్లవ సంస్థలో చేరి దాని కరపత్రాలను పంచుతూ అరెస్టయ్యారు. ఆ తర్వాత బెంగాల్ లో నారాయణ్ ఘడ్ రైల్వే స్టేషన్ పై బాంబు దాడిలో పాల్గొన్నారు. యుగాంతర్ పత్రికపై అణచివేత చర్యలకు ఆదేశిస్తూ, భారత విప్లవ కారులకు కఠిన శిక్షలు విధిస్తూ, అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్న జడ్డి కింగ్స్ పోర్డ్ ను హత మార్చేందుకు ప్రయత్నించారు.
1908 ఏప్రిల్ 30న ముజఫర్ పూర్ లో ప్రపుల్లా చాకీతో కలిసి కింగ్స్ ఫోర్డ్ వాహనంపై ఖుదీరాం బోస్ బాంబు దాడి చేశారు. ఈ దాడిలో కింగ్స్ ఫోర్డ్ భార్య, పిల్లలు మరణించారు. దాడి సమయంలో వాహనంలో అతను లేకపోవడంతో ఖుదీరాం తన లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఆ తర్వాత ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసి ఉరి శిక్ష విధించారు. ఉరి శిక్షను అనుభవించే నాటికి ఆయన వయస్సు 18 ఏండ్లు. దేశ చరిత్రలో భారత స్వాతంత్య్రం కోసం అమరుడైన అతి పిన్న వయస్కుడు ఖుదీరాం బోస్.