హైదరాబాద్ గుడిమల్కాపూర్ లోని అంకుర ఆస్పత్రి(Ankura Hospital)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆస్పత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పదవ అంతస్తులో ఆస్పత్రి బోర్డుకు మంటలు చెలరేగాయి. పక్కన ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటంతో భారీగా మంటలు వ్యాపించాయి. క్రమంగా ఐదవ అంతస్తు వరకు మంటలు అంటుకున్నాయి.
ఆ ప్రాంత మంతా దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికుల సహాయంతో రోగులను ఆస్పత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు భారీగా వ్యాపించడంతో పక్క భవనాల్లోని వాళ్లు ఆందోళన చెందారు. వెంటనే భవనాలను ఖాళీ చేసి వెళ్లారు.
మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నా. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇది ఇలా వుంటే ఈ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బంది పట్ల ఆస్పత్రి బిల్డింగ్ ఓనర్ దురుసుగా వ్యవహరించారు.
కవరేజి చేసేందుకు ప్రయత్నించిన మీడియా సిబ్బందిపై కింగ్స్ కోహినూర్ డైరెక్టర్ కొడుకు నసీర్ ఖాన్ దాడి చేశాడు. సిబ్బంది సెల్ ఫోన్లను నసీర్ లాక్నొన్నాడు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే భవనాన్ని నిర్మించారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కింగ్ కోహినూర్ ఓనర్ నివాసంలో ఇప్పటికే పలుమార్లు ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.