అన్ని రంగాల్లో మోడీ (Modi) ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, నిర్ణయాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో వెల్లడించారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో రాజకీయ అంశాలు లేకుండా, అభివృద్ధి పైనే మాట్లాడారని తెలిపారు.
ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రతిపక్షాల నోట మాట రాలేదని చెప్పారు. పలు శాఖలు సాధించిన అనేక అంశాలను రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చారని అన్నారు. దేశప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో నేటితో గ్రామ పంచాయతీల ఐదేండ్ల కాలపరిమితి ముగుస్తోందని వెల్లడించారు. సర్పంచ్ ల పదవి కాలం ముగుస్తోందన్నారు. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు.
గతంలో బీజేపీ ఎందరికో పద్మ అవార్డులను ప్రధానం చేసిందని గుర్తు చేశారు. వాళ్లంతా పార్టీలో చేరాలని తాము ఎప్పుడూ కోరలేదన్నారు. గౌరవించడం తమ బాధ్యత. రాజకీయాలతో అవార్డులను ముడిపెట్టొవద్దని సూచించారు. కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే ఆరు గ్యారంటిలను అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టామన్నారు.