– గజ్వేల్ లో బీజేపీ గెలుపు ఖాయం
– నియంతృత్వ పాలనకు చరమగీతం పాడదాం
– కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యం
– రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో..
– బందీ అయిందన్న కిషన్ రెడ్డి
– గజ్వేల్ లో ఈటల రాజేందర్ నామినేషన్
గజ్వేల్ (Gajwel) బరిలో నిలిచి సీఎం కేసీఆర్ (CM KCR) ను ఢీ కొట్టిన బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) నామినేషన్ వేశారు. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సమక్షంలో.. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఈటల గజ్వేల్ కు వస్తే కేసీఆర్ కామారెడ్డి పారిపోయారని.. అక్కడ కూడా బీఆర్ఎస్ (BRS) కు మనుగడ లేదన్నారు.
రాష్ట్రంలో నరేంద్ర మోడీ (PM Modi) పాలన వస్తుందని.. బడుగు బలహీన వర్గాల పాలన రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈరోజు ఓ కుటుంబం పాలైందని ఆరోపించారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటోందని.. భూములు, బిల్డింగులు కొనాలనుకుంటోందని విమర్శించారు. తెలంగాణ అవినీతిమయం అయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని.. భవిష్యత్ లో పెట్టుకోబోదని స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు.
స్వరాష్ట్రంలో ప్రజలను కేసీఆర్ బానిసలుగా మార్చారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి వేసినట్లేనన్న ఆయన.. భారతీయ జనతా పార్టీకి వేస్తే భవిష్యత్ తరాల అభివృద్ధికి వేసినట్లవుతుందని పేర్కొన్నారు. డబ్బుతో గజ్వేల్ ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోగా, ఉన్న వాటినీ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని పునరుద్ఘాటించారు.
ఇక, ఈటల రాజేందర్ మాట్లాడుతూ… తాను పరాయి వాడిని కాదని.. ఈ నియోజకవర్గ బిడ్డనేనని తెలిపారు. 15 ఏళ్లు ఇక్కడే ఉన్నానని గుర్తు చేశారు. గజ్వేల్ ప్రజలకు ఏ అవసరమైనా వస్తే కేసీఆర్ ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు. ఫాంహౌస్ లో ముఖ్యమంత్రి ఉంటే చుట్టూపక్కల గ్రామాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యాయన్నారు. సీఎం ఫాంహౌస్ కి వస్తున్నారంటే రోడ్డు పక్కన కంకులు, జామకాయలు అమ్ముకునే వారికి కూడా ఇబ్బందేనని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒకరికే పెన్షన్ వస్తుందని.. అదే బీజేపీ అధికారంలో ఉంటే ఇద్దరికీ వస్తుందని వెల్లడించారు ఈటల రాజేందర్.