ప్రధాని మోడీ (PM Modi) నేతృత్వంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. స్విట్జర్లాండ్‌తో సమానంగా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించారు. ప్రపంచంలోనే రైల్వే నెట్ వర్క్‌లో భారత్ నాలుగో స్థానంలో ఉందన్నారు. ప్రధాన మంత్రి ఒకే రోజు ఇన్ని పనులను ప్రారంభించడం గిన్నీస్ రికార్డు అని తెలిపారు.
రైల్వే అనేది మన దేశ సమగ్రతకు అద్దం పడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్ అడ్వాన్స్ టెక్నాలజీతో రైళ్లను నడుపుతున్నారని అన్నారు. సాధారణ బడ్జెట్లో రైల్వేను విలీనం చేసి ఆర్థికపరమైన సహకారాన్ని మోడీ అందిస్తున్నారని వెల్లడించారు.
2018-23 వరకు మూడు లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. రైల్వేకు నిధుల కొరత లేకుండా అభివృద్ది చేస్తున్నామని వివరించారు. స్థలం కేటాయింపులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రతి రోజూ సుమారు రెండు కోట్ల మంది రైల్వేల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారని చెప్పారు. అమృత్ పధకంలో భాగంగా దేశంలో 508 ర్వైల్వే స్టేషన్లను అభివృద్ది చేసేందుకు ప్రధాని మోడీ భూమి పూజ చేశారు. ఈ పనుల కోసం కేంద్రం రూ. 25వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
2014లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్ 8వేల కోట్లు, 2014 లో 29 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కానీ ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పడు 2.40లక్షల కోట్లుకు బడ్జెట్ ను పెంచామని చెప్పారు. అటు రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా 70శాతం పెరిగిందన్నారు. రైల్వే విద్యుద్దీకరణ కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ. 38,650 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపై ప్రధాని మోడీ ఆలోచనలు చేశారన్నారు. కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వేను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో 41 వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకు మొదలయ్యాయని చెప్పారు. వందే భారత్‌తో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖకు కనెక్టివిటీ చేశామన్నారు. ఐదు వందేభారత్ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం చేస్తున్నాయన్నారు.
సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రపంచంలో మొదటి సారిగా స్వదేశీ టెక్నాలజీతో మనం నడిపామని వివరించారు. కానీ కొంతమంది మూర్ఖులు ఈ ప్రక్రియను వక్రీకరించారని మండిపడ్డారు. కానీ వాటిని అధిగమించి వందే భారత్ రైళ్లు నేడు అద్భుతంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. గంటకు వంద కిలోమీటర్లు వేగంతో వెళ్లే విధంగా భద్రత, సౌకర్యాలతో రైళ్లు నడుస్తున్నాయన్నారు.