– ఎన్నికల వేళ ఊపందుకున్న భూ విక్రయాలు
– ప్రభుత్వ భూముల్ని అమ్మేస్తున్న కేసీఆర్ సర్కార్
– కోకాపేట ల్యాండ్స్ లో రికార్డ్ ధర
– ఎకరం వంద కోట్లకు అమ్మకం
– స్థలం కొన్నది హ్యాపీ మొబైల్స్
– ఫ్లాట్లను నిర్మించేది రాజపుష్ప ప్రాపర్టీస్
– డెవలప్ మెంట్ చేయడానికి రాజపుష్ప అంగీకారం
– బుద్వేల్ లోనూ వంద ఎకరాల అమ్మకానికి ఏర్పాట్లు
– ఈనెల 10న రెండు సెషన్లలో ఈ-వేలం
తెలంగాణలో భూముల ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కోకాపేటలో వేలం రికార్డుల మోత మోగించింది. ఇదే క్రమంలో హెచ్ఎండీఏ మరిన్ని భూములు అమ్మేందుకు సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లోని వంద ఎకరాలను అమ్మేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వంద ఎకరాలను 14 పార్సిల్ గా అమ్మాలని నిర్ణయించించగా.. ఈనెల 10న రెండు సెషన్లలో ఈ-వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూ.20 కోట్ల విలువను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆరు రోజుల్లో వేలం పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. దీంతో 6న ప్రీమిటీ సమావేశం 8న రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ గా నిర్ణయించారు.
కోకాపేట నియోపోలిస్ భూముల్లో రికార్డ్ ధర పలికిన నేపథ్యంలో ఈ వేలం కూడా అదే ఊపులో కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నియోపోలిస్ ఫేజ్-2లో గల 3.6 ఎకరాల ప్రైమ్ ప్లాట్ ను హ్యాపీ మొబైల్స్ కంపెనీ సొంతం చేసుకుంది. వేలంలో పోటీ పడి.. ఎకరానికి రూ.100 కోట్లు పెట్టి ఈ ప్లాటును కొనుగోలు చేసింది. తర్వాత ఈ భూమిని నగరానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ కు డెవలప్ మెంట్ నిమిత్తం అందజేస్తారని సమాచారం. అయితే, రాజపుష్ప సంస్థ అభివృద్ధి చేయడానికి ముందుకొస్తేనే.. వేలంలో పాల్గొంటామని సదరు మొబైల్ సంస్థ ముందే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి రాజపుష్ప సంస్థ అంగీకరించడంతోనే వేలంలో పాల్గొన్నదని టాక్. అందుకే, ఆ కంపెనీ ఎంత సొమ్ము పెట్టడానికైనా వెనకడుగు వేయలేదని వేలం చూస్తే అర్థమవుతోంది. వాస్తవానికి, రాజపుష్ప అంటే నాణ్యతలో రాజీ లేకుండా కడతారన్నది హ్యాపీ మొబైల్స్ ఉద్దేశం.
అసలీ ప్లాటుకు ఎందుకు అంత ధర పెట్టాల్సి వచ్చిందనే అంశాన్ని పరిశీలిస్తే.. ఈ 3.6 ఎకరాల చిన్న ప్లాటుకు సరిగ్గా గండిపేట్ లేక్ వ్యూ ఉండటమే ప్రధాన కారణం. అందుకే, వేలంలో ఒక్కసారిగా పోటీ పెరిగింది. అయినా, సదరు మొబైల్ సంస్థ తగ్గేదేలేదంటూ ఎకరానికి రూ.100 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. మరి, ఇంత సొమ్ము పెట్టి కొన్న స్థలంలో ఏం కడతారనే సందేహం ప్రతిఒక్కరికీ కలగడంలో సందేహం లేదు. కోకాపేట లోని నియోపోలిస్ ఫేజ్-2 ప్రాంతం చూడటానికి భలే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ్నుంచి ఉస్మాన్ సాగర్ ఎంతో చక్కగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ కొనుగోలు చేసిన 3.6 ఎకరాల్లో ఎంతలేదన్నా 200కు పైగా ఫ్లాట్లను కట్టే అవకాశముంది. టవర్ల విస్తీర్ణం దాదాపు యాభై అంతస్తుల దాకా ఉంటుందని అంచనా. ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం దాదాపు పది వేల చదరపు అడుగుల దాకా ఉంటుందట. మొత్తానికి ప్రభుత్వ భూముల అమ్మకం పుణ్యమా అని సర్కార్ ఖజానా ఫుల్ అవుతోంది.