కొమ్రరం భీం(Komaram Bheem) ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District)లో రెండు రోజుల నుంచి ఏనుగు(Elephant) భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగు కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం రాత్రి కొండపల్లి రోడ్డుపై గజరాజు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. తాజాగా కొండపల్లి మలుపు వద్ద గురువారం రాత్రి బస్సుకు జగరాజు ఎదురుపడినట్లు సమాచారం. దీంతో బస్సులో ఉన్నవారు అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
అప్రమత్తమైన అధికారులు రాత్రంతా ఆ ప్రాంతంలో జల్లెడ పట్టినా గజరాజు జాడ కనిపించలేదు. దీంతో పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాలను అప్రమత్తం చేశారు అధికారులు. పెంచికల్ పేట, ఎల్లూరు, మేరేగూడ, కోత్తగూడ, అగర్ గూడ, కమ్మర్ గామ్ , నందిగామ్, జిల్లేడ, మురళీగూడ, సిద్దపూర్ గ్రామాల్లో ఏనుగు సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏనుగు సురక్షితంగా సరిహద్దులు దాటించేలా అటవీ అధికారులు 70మంది సిబ్బందిని రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.
అప్పటి వరకు ఆయా గ్రామాల ప్రజలు ఇంటి నుంచి ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. 48గంటలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. ఈ క్రమంలో పెంచికల్‌పేట మండలం కొండపల్లి అటవీ ప్రాంతంలో గజరాజు కదలికలను అటవీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి గజరాజు కోసం అన్వేషణను ప్రారంభించారు. ఇందు కోసం మహారాష్ట్రలోని హుల్కర్ బృందాలను పిలిపించి సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.
కాగడాలు, దీవిటీలతో హుల్కర్లతో ఏనుగును తరలించడానికి అటవీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కుమ్రంభీమ్ జిల్లా కమ్మర్ గామ్‌లో స్థానికులకు ఏనుగు కంటపడగా కొందరు గిరిజనులు ఫొటోలు తీశారు. దీంతో సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగు పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. గజరాజు కమ్మర్ గామ్ నుంచి జిల్లేడ, నందిగామ్, మురళిగూడ వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేశారు.
మహారాష్ట్ర శివారుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఏనుగు ఎటువైపు వెళ్లుతుందనే అటవీ అదికారుల్లో ఉత్కంఠ నెలకొంది. నాలుగేళ్లుగా మంద నుంచి తప్పిపోయి ఒంటరిగా సంచరిస్తున్నట్లు గుర్తించారు. కొంతకాలంగా ఒడిశా చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో సంచరిస్తూ తెలంగాణలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.కాగా గజరాజు బుధవారం మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి ప్రాణహిత నది దాటిన ఏనుగు తెలంగాణలోకి ప్రవేశించింది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరిని రెండు వేర్వేరు చోట్ల దాడిచేసి చంపింది. దీంతో అధికారులు ఏనుగుకోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.