ఈమధ్యే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు నకిరేకల్ నేత వేముల వీరేశం (Vemula Veeresham). ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ని కలిశారు. ఎంపీ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ లో వీరేశం గెలుపునకు కృషి చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) శ్రేణులకు పిలుపునిచ్చారు. నకిరేకల్ లో వీరేశంను గెలిపిస్తే తనకు ముఖ్యమంత్రి అయినంత సంతోషంగా ఉంటుందని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుందని జోస్యం చెప్పారు కోమటిరెడ్డి. జగదీష్ రెడ్డికి ఆయన అనుచర వర్గానికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు. గతంలో స్కూటర్ కూడా లేని జగదీష్ రెడ్డి ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు.
అభ్యుదయ భావాలు ఉన్న వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు వెంకట్ రెడ్డి. నకిరేకల్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే ఆయన్ను పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు. నకిరేకల్ లో 50 వేల మెజార్టీతో వేముల వీరేశం గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ జెండాపై గెలిచిన వ్యక్తి పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం అయినా ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు కోమటిరెడ్డి. ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రతి సీటు అవసరమని చెప్పిన ఆయన.. ఔటర్ రింగ్ రోడ్డు భూములను అమ్మి.. కేసీఆర్ పథకాలకు పైసలు ఇస్తున్నారని ఆరోపించారు. దళిత బంధులో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా సీఎం అన్నారని మండిపడ్డారు.