కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna) కల్యాణం కనుల పండువగా జరిగింది. ఇవాళ(ఆదివారం) ఉదయం 10.45 గంటలకు వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతి, జగద్గురు సిద్ధిలింగ రాజకేంద్ర శివాచార్య మహాస్వామిజీ పర్యవేక్షణలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికి ప్రభుత్వం తరఫున మంత్రులు (Ministers) కొండా సురేఖ(Konda Surekha), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)లు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వారితో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు.
ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుడి మల్లికార్జున్ ఇంట్లో వీరభద్రుని ఖడ్గం, పళ్లేరానికి ప్రత్యేక పూజలు చేసి బియ్యాన్ని సేకరించారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మల్లికార్జున స్వామి రథోత్సవంతో కల్యాణ తంతు ముగుస్తుంది.
కల్యాణ మండపంలో వీవీఐపీలు, వీఐపీ, దాతలు, భక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మల్లన్న కల్యాణం నేపథ్యంలో ఆలయాన్ని, రాజగోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాజగోపురం నుంచి తోటబావి వరకు పందిళ్లు వేసి ముస్తాబు చేశారు.