జగిత్యాల జిల్లా(Jagtial District)లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు(Kondagattu) ఆంజనేయ స్వామివారి ఆలయ హుండీ లెక్కింపులో దొంగతనం కలకలం రేపింది. స్వామివారి ప్రసాద తయారీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు.
హుండీ లెక్కించేందుకు వచ్చిన సదరు ఉద్యోగి రూ.10వేలను దొంగిలిస్తుండగా అధికారులు గుర్తించారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. సదరు వ్యక్తి కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కోలకాని రవిగా గుర్తించారు.
గతేడాది ఆగస్టులో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. హుండీ లెక్కింపు సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ తిరుక్కోవేళూరు మారుతి చోరీకి పాల్పడ్డారంటూ ఆలయ ధర్మకర్త ఈవోకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో సీసీ ఫుటేజీలో మారుతి చోరీకి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి.
తాజాగా హుండీ లెక్కింపు సమయంలో మరోసారి చోరీ జరగడంతో ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా హుండీ లెక్కింపు సందర్భంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.