షహీద్ కోరుకొండ సుబ్బారెడ్డి (Korukonda Subba Reddy)… కొరటూరు మన్సబ్ దార్ ( Munsab)… 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఆదివాసి వీరుడు. పశ్చిమ గోదావరి జిల్లా యెర్నాగూడెం కేంద్రంగా 40 గ్రామాల్లో బ్రిటీష్ వారికి సమాంతరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్ప ఉద్యమకారుడు. బ్రిటీష్ వారిపై దాడి చేసి నాగవరం కోటను ఆక్రమించిన మన్యం ధీరుడు.
కోరుకొండ సుబ్బారెడ్డి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొరటూరు గ్రామం. ఆయన జిల్లాలోని బుట్టాయగూడెం నుంచి యర్నగూడెం వరకు గల పలు గిరిజన గ్రామాలకు మన్సబ్ దారుగా ఉండేవారు. మొదటి నుంచి బ్రిటీష్ పాలనను ఆయన వ్యతిరేకించే వారు. 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో యర్నగూడెం వేదికగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుబాటు జెండా ఎగురవేశారు.
40 గ్రామాల్లో ఉన్న ఆదివాసీలను కూడగట్టి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బానిసత్వాన్ని తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. అందుకే తమ 40 గ్రామాల్లో తామే పాలించుకుంటామని సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటీష్ సేనలతో సుమారు 15 రోజుల పాటు పోరాటం చేసి నాగవరం కోటను ఆక్రమించారు. దీంతో ఆ పరాజయాన్ని ఆంగ్లేయులు జీర్ణించుకోలేకపోయారు.
ఆయన్ని ఎలాగైనా పట్టుకోవాలని కుట్రలు పన్నారు. కోరుకొండ సుబ్బారెడ్డిని పట్టించిన వారికి రూ. 2500 నజరానా ఇస్తామని ప్రకటించారు. కొంత మంది ద్రోహులు ఆయన ఆచూకీని బ్రిటీష్ అధికారులకు అందించారు. దీంతో సుబ్బారెడ్డిని బ్రిటీష్ సైన్యం పట్టుకుని బంధించింది. 1857 తిరుగుబాటులో ముఖ్య నాయకులైన నానాసాహెబ్, తాంతియాతోపేతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని తెలుసుకుని బ్రిటీష్ పాలకులు ఆశ్చర్య పోయారు.
నానా సాహెబ్, తాంతియాతోపేలతో సంబంధాలపై గురించి వెల్లడించాలని ఆయన్ని చిత్ర హింసలు పెట్టారు. కానీ ఆయన ఆ విషయాలను ఆయన వెల్లడించలేదు. ఈ క్రమంలో 1858 అక్టోబరు 7 న ఆయన్ని బుట్టాయగూడెంలో ఉరితీశారు. ఆయన మృతదేహాన్ని ఇనుపపంజరంలో రాజమండ్రి కోట గుమ్మం వద్ద వేలాడ దీశారు. 1903 లో గోదావరి వరదలు వచ్చే వరకు ఆయన అస్థిపంజరం అక్కడే ఉంది.