షహీద్ సంగొల్లి రాయన్న(Shaheed Sangolli Rayanna).. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా కిట్టూరు చెన్నమ్మ (Kittur Chennamma) మొదలు పెట్టిన పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లిన యోధుడు. కిట్టూరు చెన్నమ్మ మరణాంతరం బ్రిటీష్ వాళ్లని ఎదురించి ఆమె కుమారున్ని రాజుగా ప్రకటించిన వీరుడు. స్థానిక రైతులతో కలిసి బ్రిటీష్ ఖజానా, అధికారులపై దాడులు చేసి తెల్లవాళ్ల గుండెల్లో వణుకు పుట్టించిన విప్లవ సింహం.
1798 ఆగస్టు 15న కర్ణాటకలోని బెలగావి ప్రాంతంలో సంగోల్లి రాయన్న జన్మించారు. కిట్టూరు చెన్నమ్మ సైన్యంలో సీనియర్ కమాండర్ గా పని చేశారు. 1824లో చెన్నమ్మతో కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రాయన్న యుద్ధం చేశారు. కిట్టూరు తిరుగుబాటు అనంతరం ఆయనపై బ్రిటీష్ అధికారులు అణచివేత చర్యలు ప్రారంభించారు. భూములను జప్తు చేయడం, భారీగా పన్ను విధించడం మొదలు పెట్టారు.
బ్రిటీష్ వాళ్ల చర్యలతో ఆగ్రహించిన రాయన్న వాళ్ల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలనుకున్నారు. చెన్నమ్మ దత్త పుత్రుడు శివలింగప్పను కిట్టూరుకు కొత్త పాలకుడిగా నియమించాలకున్నారు. ఈ క్రమంలో బ్రిటీష్ వాళ్లకి వ్యతిరేకంగా స్థానిక రైతులు, తిరుగుబాటుదారులతో కలిసి ఓ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ సైన్యంతో కలిసి బ్రిటీష్ ఖజానాతో పాటు ధనవంతుల ఇళ్లపై దాడులకు దిగారు.
దొరికినకాడికి దోచుకుని పోయి సైన్యాన్ని బలోపేతం చేసే పనిలో పడ్డారు. రోజు రోజుకూ రాయన్న కొరకరాని కొయ్యగా మారడటంతో ఎలాగైనా అడ్డు తొలగించాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 1830 ఏప్రిల్ లో శివ లింగప్పతో పాటు రాయన్నను అరెస్టు చేసి ఉరి తీసింది.