శ్రీ కృష్ణ జన్మభూమి (Krishna Janmabhoomi) భూ వివాదంలో అలహాబాద్ హైకోర్టు (Allahabad HIgh Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. మధురాలోని షాహీ ఇద్గా మసీదులో సర్వేకు న్యాయస్థానం ఆదేశించింది. సర్వే కోసం న్యాయవాదుల కమిషన్ విధివిధానాలను ఈ నెల 18న నిర్ణయించనున్నారు. హైకోర్టు తీర్పు గురించి హిందూ సేన తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాకు వివరించారు.
అడ్వకేట్ కమిషనర్ ద్వారా (షాహీ ఈద్గా మసీదు) సర్వే చేయాలని తాము చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు అనుమతించిందని తెలిపారు. షాహీ ఈద్గా మసీదులో హిందూ ఆలయం తాలుకు ఆనవాలు, చిహ్నాలు ఉన్నాయని న్యాయస్థానంలో తాము వాదనలు వినిపించామని చెప్పారు. ఆలయం స్థానాన్ని తెలుసుకోవాలంటే అడ్వకేట్ కమిషనర్ అవసరమని తాము డిమాండ్ చేశామన్నారు.
ఈ కేసులో షాహీ ఈద్గా మసీదు వాదనలను కోర్టు తిరస్కరించిందన్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని తెలిపారు. ఇది ఇలా వుంటే కీశ 17వ శతాబ్దంలో షాహి ఈద్గా మసీదును నిర్మించారు. శ్రీ కృష్ణుడు జన్మించిన స్థలంలో ఆ మసీదును నిర్మించినట్టు హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో మసీదులో సర్వే చేపట్టాలని హిందూ సేనకు చెందిన విష్ణు గుప్త సర్వే కోసం డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని గత డిసెంబర్‌లో స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ముస్లిం వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాజాగా హైకోర్టులో ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ముస్లిం వర్గాలు సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.