బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ (Congress) మరి ఇప్పుడు కొత్తగా సీఎం క్యాంపు ఆఫీసు, కొత్త హైకోర్టు ఎట్లా కడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంపు ఆఫీసులు వస్తాయా? అని ప్రశ్నించారు. తాము కట్టిన ప్రగతి భవన్‌ను ఇగోతోనే డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ రెడ్డి ఇచ్చారని ఆరోపించారు.
తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ…… అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల సత్తా ఏంటో ప్రజలు చెబుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని చెప్పారు. ఎన్నికలు నిర్వహించకపోతే సర్పంచుల పదవీ కాలం పొడిగించాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు డీప్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడినా గవర్నర్‌కు తప్పు కనిపించిందన్నారు. కానీ, కాంగ్రెస్ విషయంలో ఆమె పూర్తి సానుకూలంగా ఉందన విమర్శించారు. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారని, ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కేలా చేశారని పేర్కొన్నారు.
తాము అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించుకుంటే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడెలా రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించుకున్నారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారని ఫైర్ అయ్యారు.
ఎలాంటి హోదా లేకుండా అసెంబ్లీ సమావేశంలోనూ రేవంత్ రెడ్డి తమ్ముడు పాల్గొన్నారని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ కీలక నేతలు గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. కేబినెట్లో చర్చించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సాధించిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుండే జరుగుతోందన్నారు. రైతు భరోసా స్టార్ట్ చేశామని దావోస్ పర్యటనలో రేవంత్ అబద్ధం చెప్పారని ఆరోపించరు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్లు వుంటుందా? అనే అనుమానం ప్రజల్లో వుందన్నారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నారని కోమటిరెడ్డి అనలేదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు ఒక సీఎంను ఐదేండ్ల పాటు కొనసాగించే చరిత్ర లేదని ఎద్దేవా చేశారు. తమ పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తారా? లేదా? అనే అంశం మీద అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా నడుస్తోందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో హామీలను అమలు చేయాలని సవాల్ విసిరారు.