రాష్ట్రంలో సంచనాలకు తెరలేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది.ఈ కేసులో అరెస్టు అయ్యి విచారణ ఎదుర్కొంటున్న నలుగురు ఎస్ఐబీ అధికారులు ఒక్కొక్కరిగా నోరు విప్పుతున్నారు. తాజాగా రాధాకిషన్ రావు(Ex Dsp Radakishan Rao) విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు.అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా గత ప్రభుత్వంలో సుప్రీం లీడర్ ఆదేశాల మేరకే చేశామని కుండ బద్దలు గొట్టారు.
రాధాకిషన్ రావు వాంగ్మూలం మేరకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్(BRS) పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే, తమ ఫోన్లనూ ట్యాపింగ్ చేశారని సిరిసిల్ల కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిలు సోమవారం నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా స్పందించారు. ‘పైన చెప్పిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఓ మంత్రిపై పరువు నష్టం, తనపై ఆరోపణలు చేసినందుకు గాను లీగల్ నోటీసులు పంపిస్తామన్నారు.
ఈ అవమానకరమైన, నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలకు క్షమాపణ చెప్పండి లేదా లీగల్ యాక్షన్ ఎదుర్కోండి అంటూ హెచ్చరించారు. వాస్తవాలను ధృవీకరించకుండా ఈ చెత్తను బయటకు పంపుతున్న వార్తా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపుతామని’ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.