తెలంగాణ (Telangana) లో మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీ విజయం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్ (KTR). వనపర్తి జిల్లాలో కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించారు. మూడోసారి కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. పాలమూరు రైతన్నలు అద్భుతాలు సృష్టిస్తున్నారని అన్నారు.
జిల్లాలో ఒకనాడు మైగ్రేషన్ ఉంటే.. ఇవాళ అంతా ఇరిగేషన్ అని తెలిపారు కేటీఆర్. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లా ముఖచిత్రం మారనుందని.. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని.. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్పించామని.. వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని వివరించారు.
రాష్ట్రంలో పండిన ధాన్యం కొనమంటే కేంద్రం కొర్రీలు పెడుతోందని ఈ సందర్భంగా మండిపడ్డారు కేటీఆర్. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు పెద్దఎత్తున సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. దీనిద్వారా నెలకు ఎకరానికి రూ.12 వేల చొప్పున ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని.. శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలతో పంటల సాగులో మెళకువలు తెలుసుకోవాలని సూచించారు కేటీఆర్.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన తర్వాత.. బుగ్గపల్లితండా దగ్గర రూ.425కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు కేటీఆర్. అలాగే, రాజాపేట వద్ద 96 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. అనంతరం సురవరం కళాభవన్ పేరుతో నిర్మించిన భవనాన్ని, సకల సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు కేటీఆర్.