ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ (Congress)కు సినిమా ఇంకా మొదలు కాలేదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిని తప్పించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కు అసలు సినిమా ముందుందన్నారు. ఆ పార్టీ హామీలను ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.
వరంగల్ లోక్ సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ…. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని, చెమటను దార పోశారని వెల్లడించారు. విధ్వంసమైన తెలంగాణను కేసీఆర్ తన పదేండ్ల పాలనలో వికాసం వైపు నడిపించారని అన్నారు.
రాష్ట్రాభివృద్ధిపై కేసీఆర్ ఎక్కువ దృష్టి పెట్టారని అందుకే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందన్నారు. కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని వివరించారు. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిందన్నారు. తెలంగాణను ఇప్పుడు మన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చినవి ఆరు గ్యారంటీలు కాదు, 420 అబద్ధాలని నిప్పులు చెరిగారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదిగా అసత్యాలు చెప్పారన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ళ 420 హామీలతోనే ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందన్నారు.