– బీజేపీ.. మత పిచ్చి పార్టీ
– కాంగ్రెస్.. ముసలి నక్క పార్టీ
– వాటిని నమ్మితే జరిగేది నాశనమే
– హస్తం పాలనలో నీటి యుద్ధాలు జరిగాయి
– ఇప్పుడా పరిస్థితి ఉందా?
– ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నాం
– జగిత్యాలలో మంత్రి కేటీఆర్
జగిత్యాల (Jagtial) లో జై తెలంగాణ అంటే బీఆర్ఎస్ (BRS) జైత్రయత్ర మొదలైనట్టేనని అన్నారు మంత్రి కేటీఆర్ (KTR). జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తర్వాత నేరుగా అక్కడ నుండి నూకపల్లి అర్బన్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దకు చేరుకొని పరిశీలించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లతో కలిసి 3,772 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేసారు.
నూతనంగా నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ప్రారంభించారు కేటీఆర్. అక్కడి నుండి వివేకానంద మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు మంత్రి. జీవన్ రెడ్డి అంటే జగిత్యాల గతమని.. ఇప్పుడు భవిష్యత్తు సంజయ్ అని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన ఓటుకు నోటు దొంగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ గాంధీని ఆరాధిస్తారా? గాడ్సేని ఆరాధిస్తారో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ముసలి నక్క పార్టీ అని.. ఆ పార్టీకి ఓటేస్తే రైతులకి 3 గంటల విద్యుత్ గ్యారెంటీ అంటూ విమర్శించారు కేటీఆర్. ఈ సందర్భంగా మోడీ ఎవడికి దేవుడు అంటూ బండి సంజయ్ ను ప్రశ్నించారు. బీజేపీ మత పిచ్చి పార్టీ అంటూ విరుచుకుపడిన మంత్రి.. జగిత్యాలలో ఉన్న 4,520 డబుల్ బెడ్రూం ఇండ్లు ముఖ్యమంత్రి కేసీఆర్, తన నియోజకవర్గం సిరిసిల్లలో కూడా లేవన్నారు. గతంలో మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి కంటే ఎమ్మెల్యేగా జగిత్యాలను సంజయ్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సంజయ్ చేసిన పనికి జగిత్యాల అభివృద్ధే నిదర్శనమని చెప్పారు.
మంత్రులు చేయని పనులు జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ చేశారని.. మళ్ళీ ఆయన్నే గెలిపించాలని ప్రజలను కోరారు. జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పలు కంపెనీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి కరెంట్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ఆయన జగిత్యాల నియోజకవర్గంలోకి వచ్చి విద్యుత్ లైన్లు పట్టుకోవాలని.. అప్పుడు తెలుస్తుంది కరెంట్ ఉందో లేదో అంటూ చురకలంటించారు. అప్పుడు దేశానికి, రాష్ట్రానికి దరిద్రం పోతుందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో నీటి కోసం యుద్ధాలు జరిగేవన్న కేటీఆర్.. ఇప్పుడా పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తోంది వాస్తవం కాదా? అని అడిగారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలకు వారెంటీ లేదన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తారని.. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఎవరు నడిపిస్తారని ప్రశ్నించారు. ఆ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులేనంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా బీడీ కార్మికులకు 2016 పెన్షన్ ఇస్తున్నామని వివరించారు కేటీఆర్.