ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్(BRS) భావిస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ బీజేపీ(BJP) వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ ఇచ్చామని తమకూ ఓ అవకాశం ఇవ్వాలని చెబుతోంది కాంగ్రెస్(Congress). ఈ క్రమంలోనే నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎవరూ తగ్గేదే లేదంటూ మాట పడడం లేదు. తాజాగా మంత్రి కేటీఆర్(KTR), బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) మధ్య అగ్గి రాజుకుంది.
కేటీఆర్ వ్యాఖ్యలు
అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా కావాలనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ‘‘ఎన్నికలప్పుడు ఒకాయన బండిపోతే బండి ఫ్రీ, ఏది పోతే అది ఫ్రీ అన్నారని, ఇప్పుడు ఆ బండే షెడ్డుకు పోయింది’’ అని ఎద్దేవ చేశారు. వరదల సమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వివరిస్తూ ఇలా కౌంటర్ వేశారు కేటీఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండిని తొలగించడంపై ఇలా చురకలంటించారు.
బండి కౌంటర్ ఎటాక్
మంత్రి కేటీఆర్ కు అంత అహంకారం పనికిరాదన్నారు బండి. ‘‘మాదకద్రవ్యాలు తీసుకొని మాట్లాడుతున్నావా.. నీ భాషను చూసి నీ ఎమ్మెల్యేలే ఛీ అంటున్నారు’’ అని విమర్శించారు. ‘‘తుప్పు పట్టింది బండి కాదు.. నీ కారుకే తుప్పు పట్టింది’’ అని కౌంటర్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా ఉండరని అన్నారు. ఇటు రాజాసింగ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు సంజయ్. ‘‘రాజాసింగ్ దమ్మున్న లీడర్.. నీకు దమ్ముంటే గోషామహల్ నుంచి పోటీ చెయ్యి’’ అని సవాల్ విసిరారు.