కర్ణాటక (Karnataka) లోని మైసూరులో విజయ దశమి (Vijaya Dashami) వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందల ఏండ్లుగా దసరా రోజు జంబూ సవారీ కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా రాజ కోటలో జంబూ సవారీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు మైసూరు రాజ వంశీయులు, సీఎం సిద్ధ రామయ్యతో పాటు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.
సాయంత్రం 5.15 ప్రాంతంలో బూ సవారీని పూల జల్లుతో సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. గజరాజుపై స్వర్ణ అంబారీలో చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని ఊరేగించారు. చాముండేశ్వరీ దేవీ ఊరే గింపు సమయంలో ప్యాలెస్ వీధుల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అంతకు ముందు రెండు గంటలకు నంది పూజతో ఊరేగింపు ప్రారంభమైంది.
జంబూ సవారీ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఉదయం మైసూరు రాజకోటలో ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట మైసూర్ యువరాజు యధువీర్ కృష్ణరాజ చామరాజ వడయార్ ప్యాలెస్లో రాజ వంశీయులు ఆయుధ పూజ నిర్వహించారు.
ముందుగా ఆయుధాలను సోమేశ్వ రాలయం వద్దకు తీసుకు వెళ్లి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఏనుగులకు, గుర్రాలకు, గోవులకు యువరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది ఇలా వుంటే మహా రాష్ట్రలోని పుణెలో దసరా సందర్భంగా మహాలక్ష్మీ దేవి బంగారు చీరలో దర్శనమిచ్చారు.