తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను తరలించాలన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచనను హైకోర్టు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. రాజేంద్ర నగర్ ప్రాంతానికి హైకోర్టును తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు సరికాదని, సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు న్యాయవాదులు ఆందోళనకు దిగారు.
అప్జల్ గంజ్‌లోని హైకోర్టు ఆవరణ బయట నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేపట్టారు. హైకోర్టు తరలింపు విషయం గురించి అడ్వకేట్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో చర్చించకుండానే ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకుందని సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ జస్టిస్, న్యాయవాదులు తెలిపారు. నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను గురించి సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ సమీపంలో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
జనవరిలో నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్ది ఆదేశించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని న్యాయవాదులు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఉన్న ప్రాంతానికి ఇతర కోర్టులు సమీపంలో ఉన్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మరో చోటుకు హైకోర్టును తరలిస్తే రెండు చోట్లా ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకు ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.