పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా అటు రైతులను, ఇటు ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే కాంగ్రెస్ (Congress) తెగ ఆరాట పడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ (Bjp Rajyasaba member Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. దీనికి తోడు రుణమాఫీ పేరుతో రైతులను ఆగం చేస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ అనేది కాంగ్రెస్ కేవలం పొలిటికల్ స్టంట్‌లా వాడుకుంటోందని ఫైర్ అయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఈాసారి కాంగ్రెస్ పార్టీ ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని చెప్పారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని.. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోందన్నారు.
ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలు గడిచిపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా కబుర్లు చెబుతున్నాడని ఎంపీ లక్ష్మణ్ మండపడ్డారు. కాంగ్రెస్ అసలు ఏం చేసిందని, ప్రజలు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని, ఆ రెండు పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో చుక్కెదురు అవుతుందని జోస్యం చెప్పారు.