లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం లోక్ సభ సమావేశాలు రేపటితో ముగియాల్సి ఉంది. కానీ షెడ్యూల్ కన్న ఒక రోజు ముందే సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సర్వీస్ నిబంధనలు, పదవీకాలం) బిల్లు-2023కు ఆమోదం తెలిపింది.
ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు- 2023ను ఆమోదించిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ సమావేశాల్లో 12 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపినట్టు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వెల్లడించారు. ఇక న్యాయం కోసం ప్రజలు తిరగాల్సిన అవసరం లేదన్నానరు భారతీయ న్యాయ సంహిత శకం ప్రారంభమైందన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో భద్రతా వైఫల్యం ఘటనపై పార్లమెంట్ లో రచ్చ జరిగింది. ఈ ఘటనపై ప్రధాన మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభాకార్యకలాపాలు నిర్వహించడం స్పీకర్ కు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
లోక్‌సభలో చివరి రోజు మరో ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బెయిజ్, నకుల్ నాథ్, డీకే సురేశ్ లను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో పార్లమెంట్‌లో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కు చేరింది. ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య గొంతును నొక్కడమేనని విపక్షాలు విమర్శించాయి.