– ట్రైబల్ యూనివర్సిటీకి అడుగులు
– లోక్ సభ లో బిల్లు ఆమోదం
– ములుగులో రూ.889 కోట్లతో ఏర్పాటు
సమ్మక్క-సారక్క సెంట్రల్ యూనివర్సిటీ (Tribal University) ఏర్పాటు బిల్లుకు లోక్ సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ములుగు (Mulugu) జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ బిల్లును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ప్రవేశపెట్టారు. సభ్యులు చర్చ జరిపి ఆమోదించారు. రూ.889.07 కోట్లతో వర్సిటీని నెలకొల్పనుంది కేంద్రం. దీని ఏర్పాటుకు అక్టోబర్ లో కేబినెట్ ఆమోదం తెలిపింది.
ములుగు సమీపంలో 200 ఎకరాల స్థలాన్ని గత సర్కార్ గుర్తించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రతినిధులు సైతం స్థలాన్ని పరిశీలించి, యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు.. తెలంగాణలో గిరిజనుల సాధికారతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ స్థాపనతో రాష్ట్రంలోని గిరిజన జనాభాలో విద్యాపరమైన అంతరాలకు పరిష్కారం లభిస్తుంది.
ఎన్నో ఏండ్లుగా గిరిజన జనాభా ఉన్నత విద్యను పొందడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో ఆదివాసీల అక్షరాస్యత ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉంది. 73 శాతానికి బదులు 59 శాతంగానే నమోదైంది. ఇప్పుడు వర్శిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ట్రైబల్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో స్థానికుల ఆకాంక్షలను నెరవేర్చగలదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఉన్నత విద్య, పరిశోధనా సౌకర్యాలను సులభతరం చేయడంతో పాటు ప్రోత్సహిస్తుందని తెలిపారు. గిరిజన విద్యపై దృష్టి పెట్టడమే కాకుండా.. ఇది ఇతర సెంట్రల్ యూనివర్శిటీల మాదిరిగానే విద్య, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.