– నారా లోకేష్ అరెస్ట్ కాబోతున్నారా?
– ఫైబర్ గ్రిడ్ కేసు మళ్లీ తెరపైకి రానుందా?
– ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
– ఫైబర్ కేసులో లోకేష్ అరెస్ట్ కాబోతున్నట్టు ప్రచారం
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆంధ్రాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తుపై క్లారిటీ కూడా వచ్చేసింది. అప్పటి నుంచి అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనికితోడు చంద్రబాబు (Chandrababu) అరెస్ట్, దాని చుట్టూ నెలకొన్న వివాదాలతో మీడియాకు కావాల్సిన స్టఫ్ అందుతోంది. అయితే.. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ గ్రాఫ్ ను జగన్ అమాంతం పెంచేశారని ఇతర పార్టీల నేతలు సైతం చెబుతున్నారు. అయినా కూడా జగన్ (Jagan) తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఎన్ని విమర్శలు వచ్చినా.. జగన్ తీరు మారలేదని.. త్వరలో లోకేష్ (Lokesh) ను కూడా అరెస్ట్ చేయించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. లోకేష్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే.. మళ్లీ తొందరపడి ఆయన్ను అరెస్ట్ చేయరని ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు ఇష్యూతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో జగన్ అలా చేయరనేది ఇంకో వాదన.
లోకేష్ ను అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ఓ అంచనా వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ (CID) వర్గాలు ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి లోకేష్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేయగా.. వారంతా బెయిల్ పై బయటకొచ్చేశారు. రెండేళ్ల నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంది.
ఇంటింటికి తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించేందుకు టీడీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. 2017 డిసెంబర్ 27న విజయవాడలోని ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ (ఏ.ఎన్.యూ) శతాబ్ది వేడుకలు, ఫైబర్ గ్రిడ్ పథకం ప్రారంభోత్సవ బాధ్యతలు అన్నీ అప్పటి ఐటీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోనే సాగాయి. ఈ కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరై.. లోకేష్ చొరవ, నిర్వహణను మెచ్చుకున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకం మొత్తం లోకేష్ కనుసన్నల్లో జరిగింది. అయితే.. ఇందులో అనేక అవకతవకలు జరిగాయని వైసీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై మంత్రివర్గ ఉపసంఘంతో అంతర్గత విచారణ చేయించింది. కేబుల్ టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 12 లక్షల సెట్ టాప్ బాక్సులను కూడా కొనుగోలు చేసిందట. అయితే.. మార్కెట్ లో రూ.2,200కే మంచి సెట్ టాప్ బాక్సు దొరుకుతుంటే అప్పట్లోనే ఒక్కో బాక్సును రూ.4,400 పెట్టి కొన్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా కొనుగోలు చేసిన సుమారు 12 లక్షల బాక్సుల్లో సుమారు 3.5 లక్షలు అప్పట్లో పనిచేయలేదనే విమర్శలు వచ్చాయి. మరో 4 లక్షల బాక్సులు కనబడకుండా మాయమైపోయినట్లు ఆరోపించారు వైసీపీ నేతలు. ఈ కేసుపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా లోకేష్ ను అరెస్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.