పంజాబ్ మాజీ మంత్రి, బీజేపీ నేత మన్ ప్రీత్ బాదల్ (Manprith Badal) కు ఆ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో (Vigilance Bureau) షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా లుక్ అవుట్ నోటీసులను విజిలెన్స్ అధికారులు జారీ చేశారు. బటిండాలోని ఆస్తుల విక్రయాల్లో అక్రమాలకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అరెస్టును తప్పించుకునేందుకు బాదల్ దేశం విడిచి పారి పోయినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసులో బాటిండలోని ఆస్తుల కేసులో బాదల్ తో పాటు మరో ఐదుగురిపై విజిలెన్స్ అధికారులు నిన్న కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే బాదల్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. బాదల్ నివాసంతో పాటు పలు చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు. కానీ బాదల్ ఎక్కడ వున్నారనే విషయం ఇంకా తెలియకపోవడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు.
ఇది ఇలా వుంటే బాదల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో విచారణ జరగాల్సి వుంది. ఈ కేసులో బాదల్ తో పాటు బటిండా డెవలప్ మెంట్ అథారిటీ మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రమ్ జిత్ షెర్జిల్ పేరును కూడా ఈ జాబితాలో చేర్చారు. వారితో పాటు రాజీవ్ కుమార్, అమర్ దీప్ సింగ్, వికాస్ అరోరా, పంకజ్ లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
బటిండాలోని ప్రైమ్ లొకేషన్ లోని ఆస్తుల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగ్లా 2021లో ఫిర్యాదు చేశారు. బాదల్ మంత్రిగా వున్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి రెండు కమర్షియల్ ప్లాట్లను రెసిడెన్షియల్ ప్లాట్లుగా మార్చుకున్నాడని ఆయన ఆరోపించారు.
దీంతో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తు అనంతరం బాదల్ పై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.