తెలంగాణ(Telangana)లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. పగలు తేడా లేకుండా చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా పగటిపూట, రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తెల్లవారుజాము సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటకు వెళ్లాలంటే చలికి ప్రజలు జంకుతున్నారు.
ముఖ్యంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(kumuram bheem asifabad district) సిర్పూర్(Sirpur) చలికి వణికిపోతోంది. సిర్పూర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదివారం రాత్రి 10.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.
జిల్లాలోని కెరమెరి, తిర్యాణి, జైనూరు గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇక ఆదిలాబాద్ అర్బన్‌లో 12 డిగ్రీలు నమోదయ్యాయని చెప్పారు. ఆదిలాబాద్ గ్రామీణం, జైనథ్, భీంపూర్, తాంసి, తలమడుగు, బోథ్, నేరడిగొండలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. నిర్మల్ జిల్లా పెంబిలో 13.2, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 13.4, సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 13.5, భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాలుగు రోజులుగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. ఈ పరిస్థితి వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 60 ఏళ్లు దాటిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.