Telugu News » ఉద్యమ కెరటం…మదన్ లాల్ డింగ్రా…!

ఉద్యమ కెరటం…మదన్ లాల్ డింగ్రా…!

బ్రిటీష్ అధికారి కర్జన్ విల్లిని హత్య చేసి ఉరికంబం ఎక్కిన గొప్ప యోధుడు. తన లాంటి కొడుకు ఈ భరత మాతకు కేవలం రక్తం తప్ప మరేమీ అర్పించలేడని చెప్పిన గొప్ప దేశ భక్తుడు.

by Ramu
Madan Lal Dhingra A lion hearted National hero

మదన్ లాల్ డింగ్రా… చిన్న తనంలోనే స్వదేశీ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ఉద్యమ కెరటం. విదేశీ వస్త్రాలతో తయారు చేసిన ‘బ్లెజర్’ ను వేసుకోవాలన్న ప్రిన్సిపాల్ ఆజ్ఞను ధిక్కరించి కళాశాల నుంచి బహిష్కరణకు గురైన మొండి ఘటం. బ్రిటీష్ అధికారి కర్జన్ విల్లిని హత్య చేసి ఉరికంబం ఎక్కిన గొప్ప యోధుడు. తన లాంటి కొడుకు ఈ భరత మాతకు కేవలం రక్తం తప్ప మరేమీ అర్పించలేడని చెప్పిన గొప్ప దేశ భక్తుడు.

 

1883 సెప్టెంబర్ 18న అమృత్ సర్‌ లో మదన్ లాల్ డింగ్రా జన్మించారు. చిన్నతనం నుంచే స్వదేశీ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. విదేశీ వస్తువుల బహిష్కరణను ఉద్యమంలా ముందుకు తీసుకు వెళ్లారు. 1904లో ఎంఏ చేస్తున్న సమయంలో బ్లెజర్ వేసుకుని కాలేజీకి రావాలని ప్రిన్సిపాల్ ఆయన్ని ఆదేశించారు. విదేశీ వస్తువులను వ్యతిరేకించే వ్యక్తిగా తాను ఆ పని చేయలేనని తేల్చి చెప్పారు డింగ్రా.

దీంతో ప్రిన్సిపాల్ ఆగ్రహానికి గురై కాలేజీ నుంచి బహిష్కరించారు. ప్రిన్సిపాల్ కు క్షమాపణలు చెప్పి మళ్లీ కాలేజీలో చేరాలని తండ్రి ఒత్తిడి చేయగా దానికి నిరాకరించారు మదన్ లాల్ డింగ్రా. ఆ తర్వాత తన సోదరుని ఒత్తిడి మేరకు లండన్‌ లో మెకానికల్ ఇంజనీరింగ్‌ లో చేరారు. అక్కడే శ్యామ్ జీ కృష్ణ వర్మ, వీర సావర్కర్ లతో ఆయనకు పరిచయం ఏర్పడింది. వారి ప్రభావంతో అభినవ భారత్ విప్లవ సంఘంలో చేరారు. బెంగాల్ విభజన నేపథ్యంలో లార్డ్ కర్జన్ ను హత మార్చేందుకు ప్రయత్నించారు.

ఈస్ట్ బెంగాల్ మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ పుల్లర్ ను హత్య చేసేందుకు చూశారు. 1909 జూలై 1న బ్రిటీష్ అధికారి కర్జన్ విల్లీపై డింగ్రా నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ సమయంలో కర్జన్ విల్లీని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అధికారిని కూడా కాల్చి చంపారు. దీంతో ఆయనకు కోర్టు ఉరిశిక్ష విధించింది.

కోర్టులో ఆయన మాట్లాడుతూ… భరత మాతకు తన లాంటి పుత్రులు కేవలం రక్తాన్ని తప్ప మరేమీ ఇవ్వలేరని అన్నారు. అందుకే, తాను ప్రాణత్యాగానికి సిద్ధమయ్యానని చెప్పారు. భగవంతున్ని తాను ఒకటే కోరుకుంటానని.. మరో జన్మ అంటూ ఉంటే మళ్లీ మాతృభూమి భారత్ లోనే పుట్టించాలని కోరతానన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఈ భూమిపై అదే పవిత్రమైన కారణంతో మళ్లీ మళ్లీ జన్మించాలని కోరుకుంటానని చెప్పారు మదన్ లాల్ డింగ్రా.

You may also like

Leave a Comment