– మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు
– మధ్యప్రదేశ్ లో 71 శాతం..
– ఛత్తీస్ గఢ్ లో 67 శాతం వరకూ పోలింగ్
– సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటల వరకే ఎన్నిక
– కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు
– గెలుపుపై అన్ని పార్టీల ధీమా
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్లలో నిలబడి కనిపించారు.
ఛత్తీస్ గఢ్ లో ఈ నెల 7న 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొదటి విడతలో 78 శాతం ఓటింగ్ నమోదైంది. మిగిలిన 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఇటు మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ను మధ్యాహ్నం 3 గంటల వరకే నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకూ జరిపారు.
సాయంత్రం 5 గంటల వరకూ ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ లో దాదాపు 71శాతం పైగా పోలింగ్ జరిగింది. అలాగే ఛత్తీస్ గఢ్ లో 67 శాతం వరకూ పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్ లో కొన్ని తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలు జరిగాయి. రాజ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగగా హస్తం పార్టీకి చెందిన ఓ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు.
దిమనీ నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఇటు ఛత్తీస్ గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు పెట్టిన ఐఈడీ పేలడంతో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయాడు. మరో జవాన్ గాయాలపాలయ్యాడు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.