మనిషి అనే జీవి చేష్టలు ఒక్కోసారి కోతిని మించి ఉంటాయని అంటారు.. కొన్ని సందర్భాలలో జరిగే ఘటనలు చూస్తే అది నిజమే అని పిస్తుంది. ఒక్కో సారి ప్రాణాపాయం ఉన్నా రిస్క్ చేయడం మనిషికే సాధ్యం. ఇక్కడ మనం చదవబోయే మ్యాటర్ లో పోలీస్ కానిస్టేబుల్ ఎవరు ఊహించని రిస్క్ చేశారు. ఓ పాముకు సీపీఆర్ చేశారు.. ఆ ఏంటీ.. పాముకు సీపీఆర్ చేయడమా.. ! ఆశ్చర్యపోకండి.. అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) నర్మదాపురం (Narmadapuram)జిల్లా సేమరి హరిచంద్ (Semari Harichand) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇంటిలోకి పాము (Snake) చొరబడింది. దీంతో భయపడిన స్థానికులు కేకలతో ఆ పాముని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ పాము ఓ పైపులోకి దూరింది. చేసేది ఏం లేక దాన్ని చంపే క్రమంలో ఆ పైపులో పురుగుల మందు పోశారు. ఈ మందు తాగడంతో పాము అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే ఈ సమాచారం అందుకున్న స్థానిక కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి చేరుకుని పామును పరిశీలించాడు. వెంటనే దాన్ని పక్కకు తీసుకెళ్లి నీళ్లతో శుభ్రం చేశాడు.
ఆ పాము విషపూరితం కాదని గుర్తించిన ఆ కానిస్టేబుల్ దానికి సీపీఆర్ చేశారు.. పాము నోట్లో గాలి ఊదారు. అలా కాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ పాము కళ్లు తెరిచింది. పురుగుల మందు తాగి మత్తులోకి జారుకొన్న ఆ పాము పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత అడవిలో వదిలేసినట్లు అతుల్ శర్మ తెలిపారు. ఇక మనుషులకే కాదు పాములకు కూడా సీపీఆర్ ద్వారా ప్రాణం పోయొచ్చని ఈ పోలీస్ కానిస్టేబుల్ చెబుతున్నారు.
అయితే, నిపుణులు మాత్రం సీపీఆర్ ద్వారా పాములు బతకవని, ఈ ఘటనలో ఆ పాము తనకు తానుగానే మళ్లీ స్పృహలోకి వచ్చి ఉంటుందని అంటున్నారు.. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్‌ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.