తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి (Tamilnadu Higher Education MInister) కె. పొన్ముడికి (Ponmudy) భారీ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో పొన్ముడి దంపతులకు మద్రాస్ హైకోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పొన్ముడితో పాటు ఆయన సతీమణి విశాలక్షిపై రూ, 50 లక్షల జరిమానాను జస్టిస్ జయచంద్రన్ విధించారు.
రూ. 50 లక్షల జరిమానాను చెల్లించడంలో విఫలమైతే పొన్ముడి దంపతులకు మరో ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు పొన్ముడి దంపతులకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు పొన్ముడి దంపతులకు న్యాయస్థానం నెల రోజుల సమయం ఇచ్చింది.
1996-2001లో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన సమయంలో పొన్ముడి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC)కేసులు నమోదు చేసింది. పొన్ముడి మొత్తం రూ.1.75 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కానీ ఈ కేసులో సరైన సాక్ష్యాలను డీవీఏసీ సమర్పించలేక పోయింది. దీంతో పొన్ముడిపై కేసును కోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని ఈ ఏడాది జూలైలో మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు కింద కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టింది. తాజాగా ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు పొన్ముది దంపతులకు జైలు శిక్ష విధించింది.