‘మహదేవ్’ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App) యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్( Ravi Uppal)ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్ పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన్ని భారత్ కు రప్పించేందుకు దుబాయ్ పోలీసులతో ఈడీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఉప్పల్ రవిని అటు ఛత్తీస్ గఢ్, ఇటు ముంబై పోలీసులతో పాటు అక్రమ బెట్టింగ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా విచారిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని ఉప్పల్ రవితోపాటు మరో ప్రమోటర్ సౌరవ్ చంద్రశేఖర్‌లపై పీఎంఎల్ఏ కోర్టులో మనీలాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఈ క్రమంలో రవి ఉప్పల్ పరారీలో ఉన్నారు. దీంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్‌ను ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో ఈడీ విజ్ఞప్తి మేరకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ రవి వనౌతు దేశం నుంచి పాసుపోర్టును పొందారని కోర్టుకు ఈడీ వెల్లడించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా అక్రమ మార్గాల్లో ఆ సంస్థ భారీగా సంపదను సృష్టించిందని ఆరోపించింది.
ఆ డబ్బును అక్రమంగా దాచి పెట్టిందని, చంద్ర భూషణ్ వర్మ ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని అధికారులు, రాజకీయ నాయకులకు ఆ డబ్బును బట్వాడా చేసేలా రవి ఉప్పల్ చూస్తున్నారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఛత్తీస్ గడ్ ఎన్నికలకు ముందు నవంబర్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేశ్ భాఘేల్ కు రూ. 500 కోట్లు అందజేసినట్టు ఫోరెన్సిక్ విశ్లేషణలో, అసిమ్ దాస్ అనే క్యాష్ కొరియర్ స్టేట్ మెంట్ ద్వారా తెలిసిందని వెల్లడించింది.