మహారాజ నంద కుమార్ (Maharaja Nanda Kumar).. బ్రిటీష్ అధికారుల అవినీతిపై గొంతెత్తిన మొట్ట మొదట నవాబ్. ఏకంగా బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్స్ (Warren Hastings)పై బ్రిటన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ధైర్యశాలి. వారన్ హెస్టింగ్స్ అక్రమాలకు ఎదురు తిరిగి మరణ శిక్ష అనుభవించిన పోరాట యోధుడు. ఈస్టిండియా కంపెనీ పాలనలో బ్రిటీష్ కోర్టు ద్వారా ఉరితీయబడిన తొలి వ్యక్తి ఈయనే.
బెంగాల్ లోని భద్రాపూర్ లో మహారాజ నంద కుమార్ జన్మించారు. బెంగాల్ నవాబ్ గా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. మొఘల్ చక్రవర్తి షా ఆలం-2 ‘మహారాజ’ అనే బిరుదును ప్రదానం చేశారు. 1764 బక్సార్ యుద్ధం తర్వాత బెంగాల్ పూర్తిగా ఈస్టిండియా పాలన కిందకు వచ్చింది. ఆ తర్వాత మహారాజ నంద కుమార్ ను బెంగాల్ దివాన్ గా ఈస్టిండియా కంపెనీ నియమించింది.
1773లో బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ గా వారన్ హెస్టింగ్స్ నియమితుడయ్యాడు. పాలన సమయంలో అక్రమాలకు పాల్పడుతుండటంతో నంద కుమార్ సహించలేకపోయారు. భారతీయ పాలకుల నుంచి, ఈస్టిండియా అధికారుల నుంచి వారన్ హెస్టింగ్స్ లంచాలు తీసుకుంటున్నాడంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు వారన్ హేస్టింగ్స్ పై బ్రిటీష్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
దీంతో ఆగ్రహం చెందిన వారన్.. నంద కుమార్ పై సంతకాల ఫోర్జరీ కేసును అక్రమంగా నమోదు చేయించాడు. ఈ కేసులో ఆయన్ని అరెస్టు చేసి న్యాయస్థానం ఎదట హాజరు పరిచాడు. తన చిన్న నాటి స్నేహితుడు, న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే సహాయంతో నంద కుమార్ కు ఉరిశిక్ష విధించేలా చేశాడు.
బ్రిటన్ లో వర్తించే ఫోర్జరీ చట్టం 1728 ప్రకారం(బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు వర్తించదు) ప్రకారం మహారాజ నంద కుమార్ కు ఇంఫే మరణ శిక్ష విధించాడు. అనంతరం 1775 ఆగస్టు 5న కోల్ కోతాలోని విద్యాసాగర్ సేతులో ఈ శిక్ష అమలు చేశారు. తర్వాత ఈ కేసుతో పాటు పలు ఆరోపణల నేపథ్యంలో వారన్ హేస్టింగ్స్, సర్ ఎలిజా ఇంఫేలపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు.