మహారాష్ట్ర (Maharastra) లో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారుతోంది. తాజాగా బీడ్లో ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి (Prakash Solanki) ఇంటికి ఆందోళన కారులు నిప్పు పెట్టారు. చూస్తుండగానే మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. అదృష్టవ శాత్తు ఆ భవనంలో ఉన్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.
వారికి ఎలాంటి గాయాలు కాలేదని ఎమ్మెల్యే తెలిపారు. తాను ఇంట్లో ఉండగానే ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టారని చెప్పారు. అదృష్టం కొద్ది తాను, తన కుటుంబ సభ్యులు, సిబ్బంది సురక్షితంగా బయపడ్డామని పేర్కొన్నారు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు.
ఈ ఘటనపై సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. ఈ ఆందోళనలు ఎటు మలుపు తిరుగుతున్నాయో, అవి ఎక్కడికి దారితీస్తాయో మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్, నిరసనకారులు గమనించాలని అన్నారు. ఉద్యమం తప్పుడు దిశలో వెళుతోందని ఉద్యమకారులను ఆయన హెచ్చరించారు.
మరోవైపు ఈ ఘటనను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఖండించారు. హోం మంత్రిత్వ శాఖ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ఇది ఖచ్చితంగా మహారాష్ట్ర హోం మంత్రి వైఫల్యమేనన్నారు. ముమ్మూటికి ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యం వల్లే జరిగిందని ఆమె మండిపడ్డారు.