మహారాష్ట్ర (Maharastra) లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూణె (Pune )లో ట్రక్కు ఒకటి కంటైనర్ ను ఢీ కొట్టింది. దీంతో ట్రక్కులో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.
పూణె-బెంగళూరు హైవేపై స్వామినారాయణ ఆలయానికి సమీపంలో నవ్లే వంతెన సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రక్కు నుంచి మృత దేహాలను బయటకు తీశారు.
పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రక్కులో ఆరుగురు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించి ఇద్దరు వ్యక్తులు ట్రక్కు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో వారికి గాయాలైనట్టు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించామన్నారు.
మరోవైపు కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఆర్టీసీ బస్సును సుమో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మతి చెందారు. వీరితో పాటు మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఫకీరేశ్వర మఠాన్ని సందర్శించేందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.