బ్రిటీష్ పాలకుల దురాగతాలకు జలియన్ వాలా బాగ్ (Jallianwala Bagh)లాంటి ఘటనలు చరిత్ర పుస్తకాల్లో సాక్ష్యాలుగా నిలిచాయి. కానీ జలియన్ వాలా బాగ్ ను మించిన, చరిత్ర గుర్తించని ఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘటనల్లో ‘మహువా దాబర్’(Mahua Dabar)ఘటన కూడా ఒకటి. బ్రిటీష్ వాళ్ల పైశాచికత్వానికి ఈ గ్రామంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
మహువా దాబర్ అనే గ్రామం ప్రస్తుత యూపీలోని అవద్ జిల్లాలోని బస్తీ టౌన్ లో ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆరుగురు బ్రిటీష్ సైనికులతో కూడిన పడవ ఒకటి మహువా దాబర్ వైపుగా వచ్చింది. బ్రిటీష్ సైనికులను గుర్తించి వారిని గ్రామస్తులంతా చుట్టు ముట్టి దాడి చేశారు. దీంతో ఆరుగురు బ్రిటీష్ సైనికులు మరణించారు.
ఈ ఘటనపై బ్రిటీష్ పాలకులు సీరియస్ అయ్యారు. 20 జూన్ 1857న బ్రిటీష్ సైన్యం మహువా దాబర్ గ్రామాన్ని చుట్టు ముట్టింది. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని బలవంతంగా నేల మట్టం చేశారు. కనిపించిన వారిని బ్రిటీష్ సైన్యం ఊచ కోసింది. గ్రామంలోని పలు ఇండ్లలోకి దూరి అందిన కాడికి డబ్బును దోచుకున్నారు. అడ్డువచ్చిన మహిళలపై అత్యాచారం చేసింది.
అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం… గ్రామంలో 250 మందిని బ్రిటీష్ సైన్యం ఉరి తీసింది. గ్రామంలోని మొత్తం 5000 మందిని ఊచకోత కోసింది. కొంత మంది గ్రామం నుంచి పారిపోయారు. దీంతో భారత దేశ పటంలో ఈ గ్రామం పేరు కనిపించకుండా పోయింది. ఆ తర్వాత 1994లో మహ్మద్ లతీఫ్ అనే వ్యక్తి ఈ గ్రామం గురించి పరిశోధన మొదలు పెట్టారు.
లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్రకారులతో ఆ జిల్లా కలెక్టర్ ఓ కమిటీని వేశారు. ఆ చరిత్రకారులు సుమారు 13 ఏండ్ల పరిశోధనల తర్వాత 1831నాటి మ్యాప్ ను కనుగొన్నారు. అందులో మహువా దాబర్ పట్టణాన్ని గుర్తించారు. ఆ తర్వాత 1857 మ్యాప్ పరిశీలిస్తే ఆ ప్రాంత మంతా వ్యవసాయ భూమిగా కనిపించింది.