కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)తో టీ కాంగ్రెస్ (T Congress) నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీ కాంగ్రెస్ నేతలకు ఖర్గే దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్, ఇతర విషయాలపై నేతలకు హైకమాండ్ మార్గదర్శనం చేసినట్టు తెలుస్తోంది.
భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గేతో చర్చించామన్నారు. ముఖ్యంగా పోల్ మేనేజ్ మెంట్, ప్రచారం ఎలా ఉండాలనే విషయాలపై హైకమాండ్ తమకు దిశా నిర్దేశం చేసిందన్నారు. తెలంగాణలో 17 కి 17 స్థానాల్లో విజయమే లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు.
కాంగ్రెస్ ను గెలిపించాలని దేశ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. 17కి 17 స్థానాల్లో గెలిపిస్తే ఆరు గ్యారెంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రెండు మూడు స్థానాలకోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉంటుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ఇక లోక్ సభ సార్వత్రిక ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీలో ఉన్న వివిధ స్థాయి నేతలు చేయాల్సిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తమకు కొన్ని నియమ నిబంధనలు చెప్పారని వెల్లడించారు. 14 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ విజయం సాధించే అవకాశం ఉందన్నారు. అందరూ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారని పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… ‘తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కో-ఆర్డినేటర్ల సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. మెజార్టీ సీట్లలో గెలవాలని దిశా నిర్దేశం చేశారు. దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లు తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలవాల్సిన బాధ్యత కో ఆర్డినేటర్ దేనని ఖర్గే చెప్పారు’అని వివరించారు.