ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) విజయం సాధిస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కారణంగా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తమ పార్టీ సన్నద్ధం అయిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో తాము విజయం సాధిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఏ వాగ్దానాలు చేసినా, బీజేపీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అది నిరుద్యోగ నిర్మూలన కావచ్చు, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం లేదా పెట్టుబడులు కావచ్చు ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. కర్ణాటకను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రాజెక్టులు కర్ణాటకకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించనున్నారు. నవంబర్ 7న మిజోరాంలో పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఛత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో నవంబర్ 7, 17న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 17న మధ్యప్రదేశ్, 25న రాజస్థాన్, 30న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఐదు రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.