రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ (Congress) టికెట్లకు భారీగా పోటీ పెరిగి పోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం పలువురు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు (Applications) వచ్చాయి.
టికెట్ కోసం ఈ రోజు దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం నందిని దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం సతీమణి మాట్లాడుతూ….. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలని కోరామని తెలిపారు.
అగ్రనేతలు ఖమ్మం నుంచి పోటీ చేస్తే తామంతా సమిష్టిగా పని చేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వెల్లడించారు. ఒక వేళ అగ్రనేతలు ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే అక్కడ పోటీ చేసే అవకాశాన్ని తనకు కల్పించాలని కోరారు. సుమారు 20 ఏండ్లుగా తాము ఖమ్మం ప్రజలతో కలిసి పని చేస్తున్నామని వివరించారు.
వారి ఒత్తిడి మేరకే తాను లోక్సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చానని చెప్పారు. అందువల్ల తనకు అవకాశం ఇస్తే భారీ మెజారిటీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ఖమ్మం ఎంపీ స్థానానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆమె 500 కార్లతో ర్యాలీగా వచ్చారు.