బీఆర్ఎస్ (BRS)పై తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ (KCR) పరిపాలన చేశారని అన్నారు. మహిళలకు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
గతంలో ఎప్పుడు లేనంతగా తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండగా కవితకు పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజాభవన్‌కు పూలే పేరు పెట్టిన తర్వాత గుర్తొచ్చిందా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేండ్ల పాటు మహిళలకు కేబినెట్లో కేసీఆర్ అవకాశం ఇవలేదన్నారు.
ఆ సమయంలో కేసీఆర్‌ను కవిత ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు..విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. అంతే కానీ మాయ మాటలు వద్దన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీలో తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ట్రైబల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రారంభించేందుకు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు వెల్లడించారు.
త్వరలోనే అనుమతులు వస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేకపోయిందని మండిపడ్డారు. తమది ప్రజా ప్రభుత్వం అని రాష్ట్రంలోని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సీఎంఓ నుంచి కమిషరేట్ల వరకు…సింగరేణి నుంచి హెల్త్ డైరెక్టర్ల వరకు.. సామాజిక న్యాయం పాటించామని పేర్కొన్నారు.